Khairatabad Ganesh Shobha Yatra: నవరాత్రులు భక్తుల చేత పూజలు అందుకొన్న ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జన శోభాయాత్ర (Khairatabad Ganesh) ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. అర్ధరాత్రి చివరి కలశ పూజ చేసి.. తెల్లవారుజామున స్వామివారిని ట్రాలీపైకి ఎక్కించారు. శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగతుంది. గణపతి నిమజ్జనంతో ఆ ఘట్టం పూర్తి అవుతోంది. ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్ 4 వద్ద ఖైతరాబాద్ మహా గణపతి నిమజ్జనం జరగనుంది. ఇటు వీధుల్లో ఉన్న గణపతులు కూడా నిమజ్జనం జరుగుతున్నాయి.
ఖైరతాబాద్ గణేశుడితోపాటు ఇతర వినాయకుల నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ తీరంలో 100 చోట్ల నిమజ్జానానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఉదయం 8 గంటలకు సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకుంది. మధ్యాహ్నాం 2 గంటల లోపు మహా గణేశుడి నిమజ్జనం క్రతువు పూర్తి కానుంది.
ఇటు బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 9.30 గంటలకు లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. వేలంపాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది లడ్డూ వేలం రూ.24.60 లక్షలు పలికింది. బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకుంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. బాలాపూర్- హుస్సేన్ సాగర్ మార్గంలో వాహనాల రాకపోలపై ఆంక్షలు కొనసాగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనం బందోబస్త్ కోసం 40 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారని వివరించారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీస్ చేస్తామని ప్రకటించింది. రెండు గంటలకు ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తామని తెలిపింది. ఖైరతాబాద్, లక్టీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీని నియమించామని వివరించారు. ప్రయాణికుల డిమాండ్ బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లను నడపుతామని వివరించారు. 29వ తేదీన.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. నిమజ్జనం తర్వాత కూడా ఉదయం వేళల్లో వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగనీయమని ఓ ప్రకటనలో పేర్కొంది.