వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తన వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. నాని సతీసమేతంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల (Dwarka Tirumala)చిన వేంకన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి, శేష వస్త్రం (Sesavastram) కప్పుతుండగా నాని అభ్యంతరం తెలిపారు. ఆలయ సంప్రదాయాన్ని కాదని తానే స్వయంగా శేష వస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు. దీంతో ఆలయ అధికారులు, అర్చకులు అవాక్కయారు.
ఆలయం వద్దకు వచ్చిన వైసీపీ (YCP) నాయకులతో సైతం వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రశాంతంగా స్వామి వారి దర్శనానికి వస్తే.. విహారయాత్ర, పెండ్లికి వచ్చినట్లు ఇంత మంది ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పుట్టిన రోజుకి మాజీ ఎమ్మెల్యే ఉంటానని ఆయన అన్నారు.తన స్థానంలో తన కుమారుడిని వైసీపీ తరపున బరిలోకి దించాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే కొన్ని సందర్భాల్లో వెల్లడించారు.