»5 Cheetahs Roaming In Alipiri No Entry For Children Under 15 Years
TTD: అలిపిరిలో 5 చిరుతల సంచారం..15 ఏళ్లలోపు పిల్లలకు నో ఎంట్రీ!
తిరుమలలో ప్రత్యేక భద్రతా చర్యలను టీటీడీ తీసుకొచ్చింది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల పిల్లలను అనుమతించమని తెలిపింది. అలాగే 6 గంటల తర్వాత టూవీలర్లకు అనుమతి లేదని వెల్లడించింది.
తిరుమల (Tirumala) మెట్లమార్గం, ఘాట్ రోడ్డులో చిరుతల(Cheetah) సంచారంపై టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు (srivari mettu) మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిని టీటీడీ నిరాకరిస్తూ ప్రకటన చేసింది. రెండో ఘాట్ రోడ్డు (2nd Ghat Road)లో సాయంత్రం 6 గంటలు దాటితే టూవీలర్లను అనుమతించొద్దని టీటీడీ ఆదేశాలిచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై చిరుత దాడికి పాల్పడిన ఘటనపై సర్వత్రా దుమారం రేగుతోంది.
రెండు రోజుల క్రితం అక్షిత (Akshita) అనే చిన్నారి చిరుత దాడి(Cheetah Attack)లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ (TTD) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఘాట్ రోడ్డులోని పరిస్థితిని టీటీడీ ఈవో, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ తరుణంలో అలిపిరి మార్గంలో వెళ్లే పిల్లలకు టీటీడీ ఏర్పాటు చేస్తోంది. తిరుమల (Tirumala) నడక మార్గంలో ఏడో మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకూ భక్తులను బృందాలుగా టీటీడీ అనుమతిస్తోంది.
భక్తులకు వెనక, ముందు రోప్ పార్టీలను టీటీడీ(TTD) నియమిస్తూ ప్రతి 40 అడుగులకు ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చిరుత దాడి చేసిన ప్రాంతంలో 150 సీసీ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుమలలో అలిపిరి నుంచి మెట్లమార్గంలో మొత్తం 5 చిరుతలు సంచరిస్తున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుతలను బంధించేందుకు అధికారులు ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.