మహబాబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ఇవాళ ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. మహబూబాబాద్, తిరుమలగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో గతంలో పూర్తికాని కాలువలను చూసి మనసు చలించేందని గుర్తుచేసుకున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ నాలుగు మెడికల్ కాలేజీలు ఉండేవని, ఇప్పుడు అవీ 33 మెడికల్ కాలేజీలకు చేరుకున్నాయని తెలిపారు. మహబూబాబాద్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలను తాము గుర్తించి గౌరవించామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని పేర్కొన్నారు. గిరిజన బిడ్డలే సర్పంచిలై తండాలను బాగుచేసుకుంటున్నారని కేసీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా సర్పంచిలకు గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల నిధి అందజేస్తున్నామని వివరించారు. ఆ నిధులతో అభివృద్ధి పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన నాలుగు మున్సిపాలిటీలకు నిధులను ప్రకటించారు. మహబూబాబాద్, తొర్రూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. మహబూబాబాద్ కు రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు ఉండేదని, ఇవాళ అది రూ.11.5 లక్షల కోట్లకు పెంచుకోగలిగామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతోందని తెలిపారు. ఈ విషయం ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ చెబుతోందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం స్థాయిలో పనిచేసినా ఇవాళ మన జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండాలి. కానీ మనం రూ.11.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయాం అని నిట్టూర్చారు. నదుల్లో అవసరానికి మించి నీళ్లు ఉంటాయని, కానీ ఆ నీళ్లు భూమి మీదకు రావని చెప్పారు. దశాబ్దాలు గడచిపోయినా ఇలాంటి సమస్యలు పరిష్కారం కావన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినా ఫలితం లేదన్నారు.