అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు ప్రకటన చేసింది.
శబరిమల ప్రసాదం నాణ్యత, శుభ్రత మీద కొంతమంది భక్తులు గతంలో చేసిన ఫిర్యాదులపై స్పందించిన కేరళ హైకోర్టు ఆ ప్రసాదానికి నాణ్యతా పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రసాదం శాంపిళ్లను అధికారులు ల్యాబ్ కి పంపి పరీక్షలు చేశారు. తాజాగా ల్యాబ్ రిపోర్టులు అందాయి. ప్రసాదంలో పరిమితికి మించి క్రిమి సంహారక మందుల ఆనవాళ్లు ఉన్నాయని రిపోర్టుల్లో తేలడంతో కేరళ హైకోర్టు స్పందించింది. పదికి పైగా రసాయనాల అవశేషాలు అయ్యప్ప ప్రసాదంలో లభించాయని.. ఇప్పటి వరకు తయారు చేసిన ప్రసాదం పంపిణీని నిలిపివేయాలని కోర్టు ట్రావెన్ కోర్ బోర్డును ఆదేశించింది. దీంతో వెంటనే స్పందించిన ట్రావెన్ కోర్ సంస్థ కొత్తగా తయారు చేసిన అవరన్నం ప్రసాదాలు అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. అయితే.. దీనిని కూడా ల్యాబ్ టెస్టుకు పంపాలని కోర్టు ఆదేశించింది. అయ్యప్ప ప్రసాదంలో ఎలాంటి రసాయన అవశేషాలు లేకపోతే ప్రసాదం పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.