Miss Oregon USA: 99 సార్లు రిజెక్ట్ చేశారు..అయినా విజేతగా నిలిచింది!
మిస్ ఒరెగాన్ యూఎస్ఏ అందాల పోటీల్లో భారత సంతతి మహిళ మంజు విజయం సాధించింది. బెంగళూరులో పుట్టిన మంజు అంతరిక్ష శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె మిస్ అమెరికా 2023 పోటీలకు కూడా అర్హత సాధించింది.
మిస్ ఒరెగాన్ యూఎస్ఏ(Miss Oregon USA) అందాల పోటీ కిరీటాన్ని భారత మహిళ సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో అందరూ ప్రతిసారీ అనుకున్నట్టుగా ఈసారి ఇంగ్లిష్ పేరు వినపడలేదు. బెంగళూరు బ్యూటీ మంజు(Manju) పేరు వినపడేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. మరో విషయం ఏంటంటే మంజు ఒక అంతరిక్ష శాస్త్రవేత్త(scientist). మంజు కుటుంబం ఆమెకు నాలుగేళ్లప్పుడు బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో ఆమె అమ్మ గీత, నాన్న ఫణి సంరక్షణలో పెరిగింది. మంజు తల్లిదండ్రులకు విత్తన పరిశోధన ల్యాబ్ ఉండేది.
చిన్న వయసులోనే మంజు(Manju) తన తండ్రితో కలిసి అంతరిక్ష ప్రదర్శనశాలకు వెళ్లింది. కల్పనా చావ్లా కథ విని స్ఫూర్తి పొందింది. అంతరిక్షంపై ఉన్న మక్కువతో ఆమె ఒరెగాన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. నాసా(NASA)లో ఇంటర్న్షిప్ చేయడానికి ప్రయత్నించినా అనుమతి లభించలేదు. అలా వందలసార్లు ఆమె నాసాకు దరఖాస్తు చేసుకుంది. వందోసారి ఆమె దరఖాస్తును నాసా ఒప్పుకుంది. అలా ఆమెకు అలబామాలోని మార్షల్ స్పేస్ ప్లైట్ సెంటర్లో పనిచేసే అవకాశం లభించింది. ఆస్ట్రోనాటిక్స్(Astronautics)లో మంజు పీజీ చదివింది. గత ఏడాది చంద్రునిపైకి నాసా పంపిన ఆర్టెమిస్1కు క్యాప్సుల్ డిజైన్ చేయడంతో పనిచేసింది. ఆ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఆమె శిక్షణను కూడా తీసుకుంది.
మంజు(Manju) ఓ వైపు పరిశోధనలు చేస్తూనే మరో వైపు టీనేజీ వయసు నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. అయితే ఆ పోటీల్లో ఆమెకు చాలా సార్లు ఓటమి ఎదురైంది. వైఫల్యాలకు భయపడకుండా ప్రయత్నిస్తూ వచ్చింది. అలా 2017లో మిస్ బెంటన్ కౌంట్ యూఎస్ఏ, మిస్ వరల్డ్ కాలిఫోర్నియా 2019 పోటీల్లో విజేతగా నిలిచింది. తాజాగా మంజు మిస్ ఒరెగాన్ యూఎస్ఏ 2023 (Miss Oregon USA 2023) అందాల కిరీటాన్ని అందుకుంది. ఈ ఏడాది జరిగే ‘మిస్ అమెరికా 2023’ పోటీల్లో కూడా పాల్గొనడానికి అర్హత సాధించింది.