కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2023 సంవత్సరం ఎంతో కీలకం కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్యాలెండర్ ఏడాది(2023) అయిన ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలం పార్టీకి కాస్త సానుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏడాదిన్నర తర్వాత వచ్చే లోకసభ ఎన్నికల్లో గెలిచి, మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నందున ఈ తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నది. అలాగే, వచ్చేసారి అయినా ఆధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి కూడా 2023లో జరగనున్న ఎన్నికలు ముఖ్యమే.
ఎందుకంటే ఈ 9 రాష్ట్రాల్లో కలిపి 116 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులోను కేవలం 5 రాష్ట్రాల్లోనే 110 స్థానాలు ఉన్నాయి. మిగతా నాలుగు రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరామ్‌లలో 6 ఉన్నాయి. ఇందులో మొదటి మూడు రాష్ట్రాలలో ఫిబ్రవరి మార్చిలో, మిజోరాంలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
మేఘాలయలో ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం ఉంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బీజేపీ మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 20 స్థానాలు, యూడీపీ 8, పీడీఎఫ్ 4, హెచ్ఎస్పీడీపీ 2, బీజేపీ 2 గెలవగా, ఎన్పీపీ కాన్రాడ్ సంగ్మా సీఎంగా ఉన్నారు.
60 స్థానాలు ఉన్న త్రిపురలో బీజేపీ 36 సీట్లు గెలిచి అధికారం దక్కించుకుంది.
నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలుపొందింది. బీజేపీ 12 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ కూడా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది.
మిజోరాంలో 40 అసెంబ్లీ సీట్లు ఉండగా, మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు గెలిచింది.
2014 నుండి ఎన్డీయేలో ఉంది.
ఈ 4 ఈశాన్య రాష్ట్రాలను పక్కన పెడితే, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్గడ్… ఈ ఐదు రాష్ట్రాలు ఎంతో కీలకం. 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 116 లోకసభ స్థానాలు ఉండగా, పై రాష్ట్రాల్లోనే 110 ఉన్నాయి. ఇందులో మధ్యప్రదేశ్, కర్నాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నాయి.
దక్షిణాదిన బీజేపీకి పట్టున్న రాష్ట్రం కేవలం కర్నాటక మాత్రమే. అయితే గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలు ఈసారి బీజేపీకి సవాల్‌గా మారుతున్నాయి. దేవేగౌడ, కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కూడా పలు ప్రాంతాల్లో బలంగా ఉంది. కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే నెలలోపు ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో నవంబర్ నాటికి కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలో డిసెంబర్ నాటికి ఎన్నికలు పూర్తి కావాలి. కర్నాటకలో 28, చత్తీస్‌గఢ్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 29, రాజస్థాన్‌లో 25, తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. అంటే ఈ ఐదు రాష్ట్రాల్లోనే 110 స్థానాలు ఉండటంతో బీజేపీ ఈ రాష్ట్రాలపై దృష్టి సారించింది.
కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ఇటీవల బీజేపీ పుంజుకున్నది. ఈసారి గెలుపు తమదేనని తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీ 2003 నుండి వరుసగా గెలిచి, మూడు పర్యాయాలు గెలుపొందింది. 2018లో ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఈసారి తమదే గెలుపు అని కమలం పార్టీ భావిస్తోంది.
గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో దఫా గెలుస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి సెంటిమెంట్ ప్రకారం ఈసారి బీజేపీకి అవకాశం దక్కుతుందని అంటున్నారు. ఇక తెలంగాణలో క్రమంగా పుంజుకున్న బీజేపీ, వీలైతే అధికారం లేదంటే ప్రతిపక్షస్థాయికి ఎదిగి, దక్షిణాదిన రెండో రాష్ట్రంలో సత్తా చాటాలని భావిస్తోంది. 2024 లోకసభ ఎన్నికలకు ముందు 2023 బీజేపీతో పాటు అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌కు, దేశవ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు కూడా కీలకమే. తెలంగాణలో గెలిస్తేనే ఆయన జాతీయ రాజకీయాల వైపు మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది.