Madhya Pradesh CM washes feet of tribal youth victim of urination.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశమంతటా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేయడంతోపాటు అతడి ఇంటిని ప్రభుత్వం కూల్చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) బాధితుడి కాళ్లు కడిగారు. ప్రస్తుతం ఈ వార్త దేశమంతటా సంచలనంగా మారింది.
గురువారం బాధితుడిని భోపాల్ (Bhopal)లోని తన నివాసానికి పిలిపించిన సీఎం చౌహాన్ స్వయంగా అతడి కాళ్లు కడిగారు. చాలా సేపు అతడితో మాట్లాడారు. అతన్ని పరామర్శించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నా మనుసును గాయపరిచిందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానని తెలిపారు. అలాగే ఆదివాసిని క్షమాపణలు కోరారు. ప్రజలు దేవుడితో సమానం అని సీఎం అతనితో తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవమేనని తెలిపారు.
సీధీలో జరిగిన ఈ ఘటన చాలా రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయంగా కూడా దుమారం రేపింది. నిందితుడు బీజేపీ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇలాంటి ఘటనలు మానవతకు సిగ్గుచేటని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ ఖండించింది.