మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ వసతి గృహం 26 మంది బాలికలు మిస్సింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ బాలికలంతా క్షేమంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
Mohan Yadav: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్రమంగా ఓ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కనిపించకుండా పోయిన బాలికలంతా క్షేమంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వసతి గృహాలపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికల అదృశ్యానికి కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా.. మరో ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు.
భోపాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో పర్వాలియా ప్రాంతంలో ఆంచల్ బాలికల వసతి గృహం ఉంది. దీని నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన సంఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలల హక్కలు పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో ఈ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నారు. వాళ్లంతా 6 నుంచి 18 ఏళ్లలోపు వారని, మరికొందరు అనాథులని పోలీసులు గుర్తించారు.