మణిపూర్ రాష్ట్రం(Manipur State)లో 50 రోజులుగా హింసాకాండ మండుతూనే ఉంది. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట రెండు తెగల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దారుణమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామాలతో పాటు ప్రాణాలను రక్షించుకునేందుకు.. కుకీ, మైతీ తెగలకు(Kuki, Maiti tribe) చెందిన వారు ఆయుధాలు పట్టుకొని తిరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నుంచి మణిపూర్ ను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి. ఆఖరి అస్త్రంగా.. రాష్ట్రపతి పాలన(President’s Rule)ను విధించే అవకాశం కూడా కనిపిస్తోంది. హింసాత్మక ఘటనలతో మణిపూర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది.
ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా.. కుకీ, మైతీ తెగలకు చెందిన వారు ఆయుధాలు చేతబట్టి.. బంకర్ల (bunkers)లో తలదాచుకుంటున్నారు. పరస్పరం కాల్పులు (mutual fire) కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది. జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకున్న మణిపూర్లో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కుటుంబాలను, ప్రాణాలను, ఊళ్లను కాపాడుకునేందుకు.. అన్నీ పక్కనపడేసి.. కుకీ, మైతీ తెగలకు చెందినవాళ్లు.. ఆయుధాలు చేతబట్టారు. దాంతో.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియన్ ఆర్మీ(Indian Army), అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మణిపూర్ పోలీసులు.. ఇలా పెద్ద ఎత్తున బలగాలను మోహరించినా.. అక్కడ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఒకవేళ బీరేన్ సింగ్(Biren Singh)ను సీఎం పదవి నుంచి తప్పిస్తే.. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మణిపూర్ లో మళ్ళీ సాయుధ దళాలు ప్రత్యేక అధికారాల చట్టం వంటివి అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో AFSPA చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాలలో అమలు నుంచి వెనక్కి తీసుకోవడానికి కేంద్రం ఎంతో చెమటోడ్చింది. అందుకే మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితులను కేంద్రం రిపీట్ చేయకపోవచ్చు అని తెలుస్తుంది.