తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, అందులో పదహారు మందిని నాటి వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకున్నప్పుడు కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదే మార్గంలో నడుస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొదలు, తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పార్టీలను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక, నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరకక ముందు నుండే టీడీపీని టార్గెట్ చేశారు కేసీఆర్. ఈ కేసు వెలుగు చూసిన తర్వాత దాదాపు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది. టీడీపీ నుండి 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ నాటి టీఆర్ఎస్(నేడు బీఆర్ఎస్)లో చేరారు. టీడీఎల్పీ ఎర్రబెల్లి దయాకర రావు అధికార పార్టీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత నుండి టీడీపీ ప్రభావం క్రమంగా క్షీణించింది.
టీడీపీ తర్వాత మొదటి టర్మ్ నుండే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు కేసీఆర్. తనకు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని భావించిన కేసీఆర్, కాంగ్రెస్‌ను క్షీణింప చేసేందుకు బీజేపీని పైకి లేపే ప్రయత్నం చేశారని అంటున్నారు. పక్కా ప్లాన్‌తో బీజేపీని పైకి లేపి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గేందుకు కేసీఆర్ అన్ని అవకాశాలు వినియోగించారని చెబుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు మినహా అందరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు లోకసభ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ వెనుకబడింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు వరుసగా బీఆర్ఎస్ లేదా బీజేపీలోకి వరుస కట్టారు. దీంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రేసు నుండి కాంగ్రెస్ వెనుకబడిపోయి, బీజేపీ ముందుకు వచ్చింది.
అయితే బీజేపీ తనకు పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని కేసీఆర్ ఊహించి ఉండరని, అందుకే కాంగ్రెస్ పార్టీని క్షీణింప చేసేందుకు బీజేపీని ఉపయోగించుకున్నారని, కానీ ఇప్పుడు ఏకు మేకై కూర్చుందని అంటున్నారు. బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది. మరో పదకొండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్‌లలో బీజేపీ వరుస గెలుపు, మునుగోడు వంటి చోట బీజేపీ తక్కువ మెజార్టీతో ఓడిపోవడం, కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కక పోవడం గమనార్హం. బీజేపీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా దూసుకొస్తుందని రెండేళ్లకు ముందే గుర్తించిన కేసీఆర్, ఆ తర్వాత నుండి కాంగ్రెస్ వైపు చూశారని అంటున్నారు. బీజేపీ బలాన్ని తగ్గించే క్రమంలో కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
తద్వారా 2023 ఎన్నికల్లో ప్రతిపక్ష ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానంలో పోటాపోటీగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారట. అప్పుడే ప్రతిపక్ష ఓటు చీలుతుంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు ద్వారా ముందుకు సాగాలని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి అని గుర్తు చేస్తున్నారు. లెఫ్ట్‌తో పొత్తు ఉంటే వారికి బలం ఉన్న ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో భారీ అనుకూల ఓటింగ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోను వారి ఓటు బ్యాంకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.