Heat Wave:ఓ వైపు తుపాను, వరదలు దేశంలో బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు ఉక్కపోత, వేడిగాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు మూడు రోజుల్లో ఒడిశాలో వడదెబ్బకు 20 మంది చనిపోయారు. భువనేశ్వర్‌లోని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సి) కార్యాలయం కూడా వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. బాలాసోర్ జిల్లాలో కూడా వడదెబ్బకు ఒకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు మరింత సమాచారం సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.50,000 సాయం అందజేస్తామని డిపార్ట్మెంట్ నుంచి ప్రకటన కూడా వెలువడింది.
రాబోయే 3-4 రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన వేడి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలు తమను తాము హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని, ఎక్కువగా నీరు తాగాలని సూచించారు.
యూపీ, బీహార్‌లోనూ వేడిగాలులు
వేడిగాలుల కారణంగా యూపీ, బీహార్లలో కూడా మరణాలు సంభవించాయి. యూపీలోని బల్లియా జిల్లాలో గత మూడు రోజుల్లో వడదెబ్బ కారణంగా 57 మంది చనిపోయారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌ను బదిలీ చేసింది. యూపీకి ఆనుకుని ఉన్న బీహార్‌లో, వేడిగాలుల కారణంగా 50 మందికి పైగా మరణించారు. ఇందులో అరా జిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.