మతస్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న పన్నెండు దేశాల జాబితాను అగ్రరాజ్యం అమెరికా రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఈ జాబితాలో పాకిస్తాన్, చైనా, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ఈ మేరకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. బర్మా (మయన్మార్), చైనా, క్యూబా, ఎరిత్రియా, ఇరాన్, నికారాగువా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్ వంటి దేశాలను ఇంటర్నేషనల్ రిలీజియస్ యాక్ట్ ఆఫ్ 1998 ప్రకారం ఈ జాబితాలో చేర్చింది అమెరికా. ఈ దేశాలు మతం ఆధారంగా వివక్ష, అణిచివేతను ఆపలేకపోతున్నాయని, దీనిని అణిచివేసేందుకు అమెరికా సాధ్యమైనంత సాయం చేస్తుందని ప్రకటించింది.
చాందసవాద సంస్థల్లో ఆల్ సబబ్, బోకో హారమ్, హయత్ తహ్రిర్ ఆల్ షామ్, హోతీస్, ఐఎస్ఐఎస్ గ్రేటర్ సహారా, ఐఎస్ఐఎస్ వెస్ట్ ఆఫ్రికా, జమాత్ నుస్రాత్ ఆల్ ఇస్లామ్ వాల్ ముస్లీమిన్, తాలిబన్, వాగ్నర్ గ్రూప్ వంటివి ఉన్నాయి. అమెరికా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని మత స్వేచ్ఛను పర్యవేక్షించి, రక్షిస్తుందని బ్లింకెన్ అన్నారు. ప్రపంచంలో ఏ వ్యక్తికి అయినా, తన మతం ప్రకారం జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. మతం ఆధారంగా జరిగే అణిచివేతను అంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా, ఈ జాబితాలో భారత్ పేరు చేర్చాలని ఒత్తిళ్లు వచ్చాయి. ఇండియన్ అమెరికన్ ముస్లీం కౌన్సిల్, యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం తదితర సంస్థల నుండి లాబీయింగ్ ఉన్నప్పటికీ, భారత్‌ను అలాంటి జాబితాలో చేర్చలేదు అమెరికా. భారత్‌లో మతస్వేచ్ఛ పైన విమర్శలు చేసే వారికి ఇది చెంపపెట్టు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.