»New York City Is Sinking Due To Weight Of Its Skyscrapers New Research Finds
New York City: భూమిలోకి కుంగిపోతున్న న్యూయార్క్ నగరం..?
ప్రపంచంలోని అందమైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా ఇదే. అయితే, తాజాగా ఈ నగరం గురించి ఓ విస్తుపోయే నిజం తెలిసింది. ఈ నగరం భూమిలోకి కుంగిపోతోందట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ నగరం ప్రతిసంవత్సరం కుంగిపోతోందట. అందుకు అక్కడ ఉన్న ఎత్తైన భవనాలే కారణం. ఆ ఎత్తైన భవనాల వల్ల భూమిపై ఒత్తిడి ఎక్కువగా పడుతోందట. దీని వల్ల అక్కడ భూమి కుంగిపోతోందని పరిశోధనల్లో తేలింది.
సముద్రం పక్కనే ఉన్న న్యూయార్క్ నగరం రోజు రోజుకూ విస్తరించడం.. సముద్ర మట్టాలు పెరుగుతుండటం వల్ల రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్ నగరం ఏడాదికి 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగిపోతోందని చెప్పారు. న్యూయార్క్ నగరంలో 10 లక్షలకు పైగా భారీ భవనాలు ఉన్నాయని.. అవి భూమిపై 1.7 ట్రిలియన్ పౌండ్లు అంటే 77,000 కోట్ల కిలోగ్రాములకుపైగా బరువును మోపుతుందని వెల్లడించారు.
పరిశోధకులు మొదటగా న్యూయార్క్ నగరాన్ని చతురస్రాకార గ్రిడ్లుగా విభజించారు. ఈ క్రమంలోనే దాదాపు పది లక్షలకుపైగా భవనాలు ఉన్నాయని తేల్చారు. వాటి బరువు దాదాపు 85 కోట్ల టన్నుల వరకు ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలోనే నగరం ఏటా 1- 2 మిల్లీమీటర్ల మేర వేగంతో కుంగిపోతోన్నట్లు గుర్తించారు. నేల స్వభావం, ఉపగ్రహ సమాచారాన్ని విశ్లేషించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు.
మ్యాన్హట్టన్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు చాలా వేగంగా కుంగుబాటుకు గురవుతున్నాయని అధ్యయనం తెలిపింది. దీంతోపాటు బ్రూక్లిన్, క్వీన్స్ కౌంటీల పరిస్థితిపైనా అధ్యయన కర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్ నగరానికి వరదలు వచ్చే ప్రమాదాలు గణనీయంగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది. ప్రపంచంలో మిగితా నగరాల సగటు కంటే ఉత్తర అమెరికాలోని అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న న్యూయార్క్ నగరానికి సముద్ర మట్టం పెరుగుదల ముప్పు 3 నుంచి 4 రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. 84 లక్షల మంది జనాభా ఉన్న న్యూయార్క్ నగరవాసులకు ప్రమాదం పొంచి ఉందని ప్రధాన పరిశోధకుడు టామ్ పార్సన్స్ తెలిపారు.