దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతికూల ప్రతిచర్యలు వస్తాయని, అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర (G. Parameshwara) కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Sivakumar) అంశానికి తెరపడగానే, కొత్త సమస్య వచ్చి పడింది. ఫలితాలు వెలువడిన రోజు నుండి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ(Congress party) అధిష్ఠానం ఎంపిక చేసింది. అయితే కొన్ని వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం లేదని మరికొందరు నేతలు వాపోతున్నారు.
అధిష్ఠానం నిర్ణయంపై సీనియర్ నేత జి.పరమేశ్వర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ – జేడీఎస్ (JDS) కూటమిలో పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా పని చేశారు. డీప్యూటీ సీఎం పదవిని ఆయన కూడా కోరుకుంటున్నారు. 2018లో కుమారస్వామి నేతృత్వంలోనే ఏర్పడిన కాంగ్రెస్-జెడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. పైగా ఆయన దళిత నేత. ఇక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అతి ఎక్కువ కాలం పని చేసింది కూడా ఈయనే. ఎనిమిదేళ్ల పాటు కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.