చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పొంగల్ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. అలాగే విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. అయితే కోలీవుడ్‌లో ఈ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండనుంది. కానీ ఇక్కడ చిరు, బాలయ్యదే హవా.. అయితే వారసుడు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు కాబట్టి.. తెలుగులోను కాస్త బజ్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే థియేటర్ల విషయంలోను పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు దిల్ రాజు. అయితే ఈ సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్టు మాత్రమే ప్రకటించారు.. కానీ రిలీజ్ డేట్స్ మాత్రం లాక్ చేయడం లేదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాబట్టి చిరు ముందా, బాలయ్య ముందా అనే డైలామాలో ఉన్నారు. పైగా వారసుడు డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వారసుడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 12న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక వారసుడు ఎంట్రీ ఖాయమైపోయింది కాబట్టి.. ఇప్పుడు వీరయ్య, వీరసింహారెడ్డిలదే లేట్ అంటున్నారు. అయితే వారసుడు సినిమాకు ముందు ఒకరు, ఆ తర్వాత ఒకరు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 11, 13 తేదిల్లో చిరు, బాలయ్య సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.. లేదంటే మైత్రీ వారు ఇంకాస్త ముందుకెళ్తారా.. అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే అజిత్ ‘తునివు’ రిలీజ్ డేట్ కూడా రావాల్సి ఉంది. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా సందడి చేస్తాయో చూడాలి.