Minister KTR:తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు (KTR) ఈ రోజు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నిరసన సెగ ఎదురయ్యింది. ఎల్లారెడ్డి పేటలో కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫ్లకార్డులను పట్టుకొని మంత్రి కేటీఆర్ (KTR) కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు (police) వారిని అడ్డుకుని.. అక్కడినుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. గత కొద్దీరోజులుగా కురుస్తోన్న వర్షాలతో రైతులు పంట నష్టపోయిన సంగతి తెలిసిందే. గత మార్చి నెలలో సీఎం కేసీఆర్ (cm kcr) పర్యటించి.. పరిహారం ప్రకటించారు. ఇప్పటివరకు ఆ పరిహారం ఇవ్వలేదుని రైతులు, విపక్ష నేతలు అంటున్నారు.
అంతకుముందు కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ వాన ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారన్నారు. పంట కోతకు వచ్చే సమయంలో రైతు నోట వడగళ్ల వాన మట్టి కొట్టిందన్నారు. పలుచోట్ల ముప్పై శాతం నుంచి యాభై శాతం ధాన్యం రాలిపోయిందని.. రైతులకు అండగా ఉంటామన్నారు.
మరోవైపు ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హామీల గురించి ప్రస్తావించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ చెబుతోందని గుర్తుచేశారు. మరి తెలంగాణ రాష్ట్రం సంగతి ఏంటని ప్రశ్నించారు. ఉచితాలు మంచిది కాదని ఇన్నాళ్లు బీజేపీ, మోడీ గొంతు చించుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే పార్టీ మూడు సిలిండర్లు ఉచితం, పాలు ఉచితం అని మేనిఫెస్టోలో ప్రకటించడం ఏంటీ అని అడిగారు.
మోడీ (modi) దేశానికి ప్రధానియా? లేక కర్ణాటకకు ప్రధానియా… కర్ణాటకకు ఇచ్చినప్పుడు తెలంగాణకు మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వరు అని కేటీఆర్ నిలదీశారు. రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200కు పెరిగిందని, జీఎస్టీ పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని.. మోడీ (modi) పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు.