జియో వినియోగదారులకు ముకేష్ అంబానీ సూపర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలో జియో 5జీ సేవలను ప్రారంభించనుంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఏజీఎంలో.. ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు.
“డిజిటల్ కనెక్టివిటీలో కొత్త శకం మొదలుకానుంది. అదే జియో ‘5జీ’. 5జీతో.. 100 మిలియన్ ఇళ్లు కనెక్ట్ అవుతాయి. మెరుగైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. జీయో 5జీతో అందరిని, అన్ని ప్రాంతాలను, ప్రతి విషయాన్ని కలుపుకుంటూ వెళతాము. అత్యంత నాణ్యమైన సేవలు లభిస్తాయి. భారత దేశ అవసరాలతో పాటు.. అంతర్జాతీయంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక 5జీ నెట్వర్క్గా మన జీయో 5జీ నిలుస్తుంది. 5జీ లెటెస్ట్ వర్షెన్.. ‘స్టాండ్అలోన్-5జీ’నీ తీసుకొస్తున్నాము. 4జీ నెట్వర్క్తో దీనికి అసలు సంబంధమే ఉండదు,” అని రిలయన్స్ ఏజీఎంలో.. ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా జియో 5జీ సేవల కోసం రూ. 2లక్షల కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు తెలిపారు ముకేశ్ అంబానీ. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో జియో 5జీ సేవలు తొలుత అందుబాటులోకి రానున్నాయని, 2023 చివరి నాటికి.. దేశంలోని ప్రతి పట్టణానికి ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.