సీఎం కేసీఆర్… తెలంగాణలో ముందస్తు ఎన్నికలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలను కేసీఆర్ స్వయంగా ఖండించారు. ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని… జరగాల్సిన సమయంలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. అయితే… ముందుగా… ఆ ఆలోచన ఉన్నప్పటికీ… మునుగోడు ఎన్నికల తర్వాత ఆ ఆలోచన మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఖర్చు చేసినా కేవలం పదివేల మెజారిటీ రావడంతో కేసీఆర్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతుండటం కూడా హాట్ టాపిక్ అవుతోంది. తెరాసకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావించి ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళితే నష్టమే తప్ప లాభం ఉండదని కేసీఆర్ కు అర్థమైంది.
అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పరువు తీయాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నించగా అందుకు భిన్నంగా జరిగింది. బీజేపీ తప్పు చేసిందని ప్రూవ్ చేయాలని కేసీఆర్ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రాకుండా ప్రగతి భవన్ కు పరిమితం కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తెరాస తప్పులను సరిదిద్దుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 2024 ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తెరాస సిద్ధమవుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు మరికొన్ని కొత్త పథకాలను తీసుకువచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.