ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో ప్రధానికి ప్రజలు నీరాజనం పట్టారు. ఘన స్వాగతం పలికారు. కాగా… విశాఖలోనే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత… పవన్ తో మోదీ భేటీ అయ్యారు. ప్రధాని బస చేసిన ఐఎన్ఎస్ చోళ హోటల్లో ఇరువురూ సుమారు 35 నిమిషాల పాటు చర్చించారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశం అనంతరం హోటల్ వెలువల మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మంచి రోజులు వస్తాయని పవన్ పేర్కొనడం విశేషం.
‘రెండు రోజుల కిందట నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయణ్ని కలిశాను. ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే కలవడం. ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన మీటింగ్ ఇది. మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. ప్రధాని ఆకాంక్ష కూడా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు తెలియజేశానని చెప్పారు. ‘భవిష్యత్తులో ఇది ఏపీకి మంచి రోజులు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అంటూ పవన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు