ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. నేపాల్ లో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపంలో ఆరుగురు మరణించగా , అయిదుగురు గాయపడ్డారు. భూకంప ప్రభావానికి దోతీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోయిందని జిల్లా ప్రధాన అధికారి కల్పనా శ్రేష్ఠ తెలిపారు భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా రికార్డయిందన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యానికి అనేక చోట్ల ఇళ్ళు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నేపాల్ లో 5 గంటల వ్యవధిలో భూమి కంపించడం ఇది మూడోసారి. నిన్న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఒకసారి, మళ్ళీ 9.40 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. దీని ప్రభావానికి ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లోనూ భూప్రకంపనలు సంభవించాయి.
ఢిల్లీ-ఎన్ సీ ఆర్ లో దీని మ్యాగ్నిట్యూడ్ 5.6 గా నమోదయింది. ఉత్తరాఖండ్ లో 20 సెకన్ల పాటు భూమి కంపించింది, రిక్టర్ స్కేలుపై ఇది 4.3 గా రికార్డయిందని అధికారవర్గాలు తెలిపాయి. ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నాయి. అయితే భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నోయిడాలో అనేకమంది ఈ భూకంప ప్రమాదాన్ని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.