»Ap Amaravati Protest 1200 Day Was Not A Movement It Was All A Scam Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: అమరావతి పేరుతో జరిగింది ఉద్యమం కాదు..అంతా స్కాం
ఏపీలోని అమరావతిని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అభివర్ణించారు. అక్కడ రైతులకు ఏమి మోసం జరగలేదని, వారంతా భూములు అమ్ముకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు(chandrababu naidu) బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి(Amaravati)పేరుతో ఇన్నాళ్లు జరిగింది ఉద్యమం కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అతని బినామీల కోసమే ఇదంతా చేపడుతున్నారని ఆరోపించారు. రైతుల యాత్రలని మొదలు పెడితే అవి సగం దూరం కూడా వెళ్లకుండా ఆపివేశారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇదోక పెద్ద స్కాం అని పేర్కొన్నారు. అమరావతిలో రైతులందరూ ఎప్పుడో వారి భూములు అమ్మేసుకున్నారని తెలిపారు. మిగిలిన వాళ్లు అంటే పెట్టుబడి పెట్టి లాభాలు వస్తాయనుకున్నవారు కొంతమంది నష్టపోయి ఉండవచ్చని సజ్జల వెల్లడించారు.
ఈరోజు(మార్చి 31) 1200వ రోజు అని అమరావతి(Amaravati)లో ఏదో కార్యక్రమం చేశారన్నారు. అది 1200 కాదు లక్ష రోజులు అయినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు. ఒక ప్రణాళికబద్దంగా 200 లేదా 500 మంది శిబిరంలో కూర్చుంటున్నారని చెప్పుకొచ్చారు. దానిని నడపడం పెద్ద సమస్య కాదని దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు మద్దతుగా కూడా ఓ ఉద్యమం నడుస్తున్నట్లు గుర్తు చేశారు.
ఈ క్రమంలో అమరావతిపై ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) డిమాండ్ చేశారు. టీడీపీ(TDP) ఓ కుట్ర ప్రకారం దీనిని నిర్వహిస్తుంటే మిగిలిన వాళ్లు ఎందుకు మద్దతు తెలుపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాజధాని కోసం ఓసారి 5 లక్షల కోట్లు, తర్వాత ఇంకోసారి లక్ష కోట్లు కావాలని కేంద్రాన్ని అడిగినట్లు గుర్తు చేశారు. అయితే లక్ష కోట్లను చంద్రబాబు ఎలా తీసుకువస్తారని నిలదీశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు వికేంద్రీకరణ విధానం ప్రాంతాల అభివృద్ధిపై కూడా సమాధానం చెప్పాలని కోరారు. మరోవైపు మూడు రాజధానుల అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా చెప్పాలని తెలిపారు. ఆ నేపథ్యంలో అసలు అమరావతి రైతులను వైసీపీ(YSRCP) ప్రభుత్వం మోసం చేయలేదని స్పష్టం చేశారు.