seetharamula kalyanam: జ్ఞానాన్ని అందించే రామనామం!
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 ఏళ్లు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఆ ప్రభువు. ఈ శుభ సంఘటన చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి రోజున భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు.
శ్రీరాముడు ఆదర్శం
రామాయణం అంటే… భార్యాభర్తలు ఎలా బ్రతకాలో నేర్పింది.. అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉండాలో చూపింది.. తండ్రీ కొడుకుల మధ్య బంధం ఏమిటో తెలిపింది.. స్నేహం ఎలా ఉండాలో చెప్పింది.. చెడును ఉపేక్షించవద్దని అంటోంది.. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాలని నేర్పుతుంది.. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడమని రామాయణం.. రాముడు చెబుతున్నాడు. అందుకే శ్రీరాముడు యుగయుగాలుగా ఆదర్శమయ్యాడు. తండ్రి తన పినతల్లి కైకేయికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. అందుకే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. సీతమ్మ తల్లి కూడా భర్త రథం అయితే భార్య చక్రం, భర్త వీణ అయితే భార్య తీగ అని చెబుతుంది. రామచంద్ర ప్రభువు అయోధ్యకు రాజు అయినా కాకపోయినా ఆయన వెంటే నడిచింది. రాముడితో పాటు కష్టాలు అనుభవించింది. భార్య అంటే ఎలా ఉండాలో చూపించింది. రాముడు, సీత మాత్రమే కాదు… సోదరుడు ఎలా ఉండాలో లక్ష్మణ, భరత, శత్రఘ్నులు, స్నేహం ఎలా ఉండాలో సుగ్రీవుడు, హనుమంతుడు చూపించారు. ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని ఇప్పటికీ చెబుతుంటారు.
సీతారాముల కల్యాణం
పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం ఇది. చాలామంది ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని , లక్ష్మణుని , ఆంజనేయుని ఆరాదిస్తారు. భద్రాచలంలో రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తలమీద తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
శ్రీరామనవమి పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామ నవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు.
‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండవలె. ఓసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.
అందుకు పరమేశ్వరుడు , “ఓ పార్వతీ ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే!!
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు , భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని హిందువుల విశ్వాసం. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి రోజున అయిదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.
మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మన లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. ఆ తర్వాత ‘మ’ అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవని అర్థం. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని అంటారు. శ్రీరామ నవమి రోజున గ్రామాల్లోని ఆలయాల్లో, వీధులలో పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. వడపప్పు , పానకం , నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.