ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య వాదోపవాదనలు మిన్నంటుతున్నాయి. ఒకరిపై మరొకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా పవన్ ని టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. పవన్ సైతం ఏమాత్రం తగ్గకుండా వారి మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా.. సడెన్ గా పవన్.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandra babu)ని కలిశారు.
విజయవాడలో పవన్(pawan kalyan).. చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని నోవోటెల్ హోటల్ కు వచ్చిన చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురు సమావేశమై విశాఖలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జనసేనానికి సంఘీభావం తెలిపారు. కాగా, ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా… ఈ రోజు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా బీజేపీపై పొత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ఇక దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇచ్చారు.ఇదే సమయంలో ఆయన చంద్రబాబు నాయుడితో చర్చించడంతో టీడీపీ-జనసేన మళ్లీ కలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయన్న ఊహాగానాలు వస్తున్నాయి. మరి దీనిపై పవన్ ఏలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. మరో వైపు పవన్… బాలయ్య అన్ స్టాపబుల్ షోకి కూడా వచ్చే అవకాశాలుు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.