ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రోజు రోజుకీ హీట్ పెంచుతోంది. అమరావతి రాజధానిగా ఉండాలని అక్కడి ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా… విశాఖనే పరిపాలనా రాజధానిగా ఉండాలని అధిక పార్టీ మొండిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో… ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జేఏసీ పిలుపు మేరకు వైసీపీ నేతల మద్దతుతో విశాఖ నగరంలో గర్జన నిర్వహించారు. ఏపీ మంత్రులు దాదాపుగా ఈ గర్జనకు హాజరయ్యారు. జేఏసీ నేతలు ఈ గర్జన లక్ష్యాలను వివరించారు. ఆ తరువాత మాట్లాడిన మంత్రులు మూడు రాజధానుల లక్ష్యాలను వివరించారు. వెనుక బడిన ఉత్తరాంధ్ర – రాయలసీమ జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వివరించారు. అమరావతితో పాటుగా ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది తమ లక్ష్యమని వివరించారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశమంటూ ఆరోపించారు.
ఉత్తరాంధ్రలో రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ – జనసేన తో పాటుగా వారికి మద్దతుగా నిలుస్తున్న మీడియా సంస్థలను ఆ ప్రాంతంలో బహిష్కరించాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బినామీగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. పవన్ కు విశాఖలో షూటింగ్ లు..కలెక్షన్లు.. పోటీ చేయటానికి సీటు కావాలి కానీ, రాజధానిగా విశాఖ ఉండకూడదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కోసం పోరాటం చేస్తామని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర ప్రజల మనసు తెలిసిన వ్యక్తిగా జగన్ తీసుకున్న నిర్ణయానికి అందరం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర కోసం అందరం కలిసి పోరాటం చేయాలని మంత్రి ధర్మాన సూచించారు. రాజకీయ పోరాటం తప్పదని స్పష్టం చేసారు. అంతకు ముందు అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డు వరకు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని..తాము చేసేది ప్రజా పోరాటమని వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనం రూపుమాపటానికే ఈ మూడు రాజధానులు తీసుకొచ్చామని సభలో పాల్గొన్న నేతలు వివరించారు.