తాను ఎప్పుడూ బీజేపీ సిద్దాంతాలకే కట్టుబడి ఉన్నానని.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు ఏ పని చేయలేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ కేసు విషయంలో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బీజేపీ షోకాజు నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్టు 23న షోకాజు నోటీసులు జారీ చేసింది. జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు అప్పట్లో రాజాసింగ్ సతీమణి ఉషా బాయి గడువు కోరారు. బీజేపీ షోకాజు నోటీసుకు నేడు రాజాసింగ్ సమాధానం ఇచ్చారు.
బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు నేడు పాల్పడలేదన్న ఆయన పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని అన్నారు.ప్రజలకు, హిందువులు సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండని కోరిన ఆయన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే నాపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఎంఐఎం, టీఆర్ఎస్ లు కుట్రపూరితంగా నాపై 100 కేసులు పెట్టాయని అన్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందన్న ఆయన పాత బస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. మరోవైపు రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలంటూ కొన్ని రోజులుగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 22న పెద్ద అంబర్ పేట్ పాదయాత్ర ముగింపు సభలో కూడా రాజాసింగ్ అభిమానులు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఎపిసోడ్ లో బీజేపీ నాయకత్వం పై ఒత్తిడి పెరుగుతోంది.