»Two Died With Negligence Of Humanity On Srisailam Highway
Srisailam: శివ శివా.. మానవత్వం లేని మనుషులు.. కన్నుమూసిన బాలిక
రోడ్డుపై కూతురును పట్టుకుని ఆపాలని కోరుతున్నా వాహనదారులు ఆపకపోవడంతోనే పాప ప్రాణం గాల్లో కలిసింది. అదే ఎవరో ఒకరు వాహనం నిలిపి ఉంటే పాప బతికి ఉండేది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని వెళ్లి కోరికలు కోరే వారు తాము నిర్వర్తించాల్సిన కనీస ధర్మం చేయకపోతే ఏ దేవుడు కరుణించడు. పైగా ఆపదలో ఆదుకునేవారే దేవుడు అంటారు. అలాంటిది దేవుడుగా మారాల్సిన వాళ్లు మానవత్వం లేకుండా మారుతున్నారు.
మహా శివరాత్రి వేళ శ్రీశైలం (Srisailam)లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కొండపైన ఉన్న దేవుడిని ప్రార్థించి వెళ్లారు తప్ప.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోకుండా కర్కశంగా వ్యవహరించారు. మాకేమి పట్టింది అనే ధోరణితో ప్రవర్తించారు. ఇలాంటి మానవత్వం (Humanity) లేని మనుషుల వలన ఓ చిన్నారి కన్నుమూసింది. ఆపత్కాలంలో ఎవరూ ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో వైద్యమందక బాలిక మరణించింది. ప్రమాదం జరిగి నడి రోడ్డుపై కొనప్రాణంతో బాలిక విలవిలలాడుతుంటే ప్రజలు ఎవరూ స్పందించకపోవడంతో శివ శివ అంటూ అమ్మాయి మృతి చెందింది. మనసును కలిచి వేసే ఈ సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లా (Nandyal District)లో చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన జంబులయ్య, మైమ (26) భార్యాభర్తలు. వీరికి సరిత, సాత్విక ఇద్దరు సంతానం. ఏడాదిన్నర వయసు ఉన్న సాత్వికకు అనారోగ్యం చెండడంతో చికిత్స కోసం ఆదివారం భార్య మైమ స్వస్థలమైన ప్రకాశం జిల్లా (Prakasam District) మార్కాపురం (Markapuram) మండలం నల్లగట్టకు బయల్దేరారు. నల్లమల అడవులలో గుండా బైక్ పై భార్య మైమ, సాత్వికతో కలిసి జంబులయ్య బైక్ పై వెళ్తున్నాడు. ఆత్మకూరు మండలం బైర్లూటి దాటిన తర్వాత వేగంగా ఓ జీపు వెళ్లింది. అయితే ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో జీపు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల వస్తున్న జంబులయ్య బైక్ అదుపు తప్పింది.
అందరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో భార్య మైమ అక్కడికక్కడే చనిపోగా చిన్నారి సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో గిలగిల కొట్టుకుంటోంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు జాతీయ రహదారిపైకి వచ్చి వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడు. వీరి పరిస్థితిని చూసి వాహనదారులు ఎవరూ ఆపలేదు. శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నా ఎవరూ స్పందించలేదు. పాపను బతికించుకునేందుకు జంబులయ్య వాహనాలన్నింటిని ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అయినా స్పందించకపోవడంతో పాప పరిస్థితి విషమిస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాస నాయుడు అనే వ్యక్తి తన వాహనాన్ని ఆపాడు. అతడి కారులో భార్య మృతదేహంతో పాటు సాత్వికను వేసుకుని జంబులయ్య బయల్దేరాదు. ఆత్మకూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే బాలిక మృతి చెందింది.
బాలిక మృతి చెందడంతో జంబులయ్య గుండెలవిసేలా రోదించాడు. వాహనాలు ఆపాలని కోరినా ఎవరూ ఆపలేదని, దానివలన తన కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సకాంలో దవాఖానాకు వచ్చి ఉంటే తన కుమార్తె బతికేదని తెలిపాడు. ఒకేసారి భార్య, కుమార్తెను కోల్పోవడంతో జంబులయ్య రోదిస్తూ ఆస్పత్రిలో కుప్పకూలాడు. మనుషులు రోజురోజుకు దయ, కరుణ అనే లక్షణాలు కోల్పోతున్నారు. రోడ్డుపై కూతురును పట్టుకుని ఆపాలని కోరుతున్నా వాహనదారులు ఆపకపోవడంతోనే పాప ప్రాణం గాల్లో కలిసింది. అదే ఎవరో ఒకరు వాహనం నిలిపి ఉంటే పాప బతికి ఉండేది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని వెళ్లి కోరికలు కోరే వారు తాము నిర్వర్తించాల్సిన కనీస ధర్మం చేయకపోతే ఏ దేవుడు కరుణించడు. పైగా ఆపదలో ఆదుకునేవారే దేవుడు అంటారు. అలాంటిది దేవుడుగా మారాల్సిన వాళ్లు మానవత్వం లేకుండా మారుతున్నారు.