ఈ కుటుంబంలోని ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) దుర్మరణం పాలవగా.. అనారోగ్యంతో ఇద్దరు ఆకస్మిక మృతి చెందారు. ఇక మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కుటుంబాన్ని యముడు వెంటపడుతున్నట్లు పరిస్థితి ఉంది. తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది.
నందమూరి కుటుంబానికి (Nandamuri Family) ప్రాణ గండం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ కుటుంబంలో తరచూ విషాద సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, అకస్మాత్తుగా మరణాలు ఆ కుటుంబానికి సంభవిస్తున్నాయి. ఈ కుటుంబంలోని కొందరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) దుర్మరణం పాలవగా.. అనారోగ్యంతో మరికొందరు ఆకస్మికంగా మృతి చెందారు. ఇక మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కుటుంబాన్ని యముడు వెంటపడుతున్నట్లు పరిస్థితి ఉంది. తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది. నాలుగు పదుల వయసులో అతడు కన్నుమూయడం నందమూరి అభిమానులను కలచివేస్తున్నది.
తొలి విషాదం
రోడ్డు ప్రమాదంలో తొలిసారి నందమూరి కుటుంబానికి చెందిన జానకీ రామ్ (Nandamuri Janaki Ram) మృతి చెందాడు. 2014 డిసెంబర్ 6వ తేదీన నల్గొండ జిల్లా (Nalgonda District) కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ దుర్మరణం చెందాడు. జానకీరామ్ హైదరాబాద్ వెళ్తుండగా నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వరి నారు తీసుకుని బయల్దేరాడు. రాంగ్ రూట్ లో ట్రాక్టర్ ను తీసుకు రాగా ఈ వాహనాన్ని జానకీ రామ్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
హరికృష్ణ దుర్మరణం
పెద్ద కుమారుడు మరణించిన నాలుగేళ్లకు అదే జిల్లాలో నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) మృతి చెందాడు. నందమూరి కుటుంబానికి అత్యంత విషాదం నింపిన సంఘటన నందమూరి హరికృష్ణ కన్నుమూయడం. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుమారుడు, నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న తెలంగాణ (Telangana)లోని నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరై హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యాడు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో అన్నెపర్తి సమీపాన హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అటు నుంచి రోడ్డు అవతల వైపు ఎగిరిపడి బోల్తా కొట్టింది. తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే హరికృష్ణ మృతి చెందాడు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె
గతేడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheshwari) ఆకస్మికంగా మృతి చెందారు. 1 ఆగస్టు 2022న ఇంట్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడడం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోజు మాదిరే అల్పాహారం తీసుకుని విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్లిన ఉమా మహేశ్వరి అనంతరం కొద్దిసేపటికే ఉరి వేసుకున్నారు.
రోడ్డు ప్రమాదాలు
ఇక ఈ కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. ఎన్టీఆర్ (NTR) మనువడు, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా రోడ్డు ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో బయటపడ్డాడు. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేపట్టాడు. 27 మార్చి 2009న ప్రచారం ముగించుకుని హైదరాబాద్ కు బయల్దేరగా ఖమ్మంలో అతడి వాహనం ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ ను హుటాహుటిన హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నాడు.
రామకృష్ణకు ప్రమాదం
తాజాగా ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ (Nandamuri Ramakrishna) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 10 ఫిబ్రవరి 2023న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-10లో కారులో బయల్దేరగా ఆయన వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అతడికి ప్రమాదం తప్పింది. ఇక ఎన్టీఆర్ కుమారుడు సాయికృష్ణ 2004లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇలా నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య వంటివి తీవ్ర విషాదం నింపుతున్నాయి. 15 ఏళ్లలో ఎన్నో విషాదాలను నందమూరి కుటుంబం ఎదుర్కొన్నది.