»Cm Ys Jagan Lays Foundation Stone For Kadapa Steel Plant
kadapa steel plant: స్టీల్ ప్లాంట్‌కు మరోసారి జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు. పరిశ్రమ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు జిందాల్. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి JSW కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకున్నది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి-పెద్ద దండ్లూరు గ్రామాల మధ్య నిర్మాణం చేపడుతోంది. దాదాపు 3592 ఎకరాల్లో, రూ.11,606 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిశ్రమకు ఇప్పటికీ నాలుగుసార్లు శంకుస్థాపన చేశారు. 2007 జూన్ 10న నాటి సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి, 2018 డిసెంబర్ 27న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. జగన్ రెండుసార్లు చేయడం గమనార్హం. 2019 డిసెంబర్ 23న మొదటిసారి శంకుస్థాపన, ఇప్పుడు మరోసారి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ శంకుస్థాపనకు ఎక్కువమందిని పిలువలేకపోయినట్లు చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్ కల ఇప్పటిది కాదని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్టీల్ ప్లాంట్ అవసరమని తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి భావించారని చెప్పారు. తన తండ్రి మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. రూ.8800 కోట్లతో మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుందని, స్టీల్ ప్లాంటు ఏర్పాటుతో జిల్లా మరింత వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్లాంట్ రావడం కోసం చాలా కష్టపడవలసి వచ్చిందన్నారు. దేవుడి దయ కారణంగా మంచి రోజులు వచ్చాయని, స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుందన్నారు. గండికోట రిజర్వాయర్ నుండి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా అవుతుందని, తొలి విడతలో రూ.3300 కోట్లతో ప్రతి సంవత్సరం పది లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ తొలి దశ ఇరవై నాలుగు నెలల్లో పూర్తవుతుందన్నారు. రెండో ఫేజ్ అయిదేళ్లలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సజ్జన్ జిందాల్ మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంచి మిత్రులు అని, ఏపీకి సంబంధించి ఎన్నో విషయాలు తనతో పంచుకున్నారన్నారు. అలాగే, జగన్‌తోను చాలాకాలంగా పరిచయం ఉందని, తండ్రి బాటలోనే నడుస్తున్నారని కితాబిచ్చారు.
స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కొంతమంది అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కొందరి కుయుక్తులు పని చేయలేదని, వైయస్ కలను జగన్ నెరవేరుస్తున్నారన్నారు. జిల్లా ఇక ఉక్కునగరంగా మారనుందన్నారు. రాయలసీమ ప్రజల కల సాకారమవుతోందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణాన్ని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, నిర్మాణం పూర్తయితే వేలాది మందికి ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందన్నారు. జిల్లా ముఖ చిత్రమే మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.