KCR రాజీనామా చేయ్.. డేట్, టైమ్ ఫిక్స్ చేయ్: బండి సంజయ్
సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయనని ప్రధాని చెప్పారని, దీనిపై కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని సంజయ్ ప్రశ్నించాడు. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని, 11 నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుందని తెలిపాడు. శాసనసభ సమావేశాలు రాజకీయ సభగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో (Telangana Budget Sessions) ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేసిన ప్రసంగం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాలనపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ కన్నా యూపీఏ (UPA) పాలన మేలు అని, ఈ సందర్భంగా ఒక కన్ను కథ చెప్పి మోదీని, బీజేపీ ఎంపీల (BJP)ను ఎద్దేవా చేశారు. కేంద్రం చేసిన మోసాలను లెక్కలతో సహా కేసీఆర్ సభ ముందు ఉంచారు. ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి (Chief Minister) రాజీనామా చేస్తానని సంచలన సవాల్ విసిరారు. సీఎం విమర్శలపై బీజేపీ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర విమర్శలు చేశాడు.
‘సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలన్నీ నిరూపిస్తా.. మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైమ్ ఫిక్స్ చేయ్. బహిరంగ చర్చకు సిద్ధం. ఆధారాలతో సహా నిరూపిస్తా. 24 గంటల విద్యుత్ సరఫరా గురించి బీఆర్ఎస్ నాయకులు రైతుల వద్దకు పోయి చెప్పే దమ్ముందా? జీడీపీ గురించి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన విషయాన్ని ఐఎంఎఫ్ చెప్పింది. ఇచ్చిన హామీల విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ పెద్ద డిఫాల్టర్ ముఖ్యమంత్రి అని, ఆయన మాటలు నమ్మేదెవరు. హైకోర్టు చీవాట్లు పెట్టినా 56 వేల జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా దాచిన కేసీఆర్ మోదీ పాలన గురించి మాట్లాడడం సిగ్గు చేటు. ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పాతిపెడతారు’ అని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
‘అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆయన అబద్ధాలకు అసెంబ్లీ మలినమైంది. మోదీని తిట్టడానికి, కేంద్రాన్ని బద్నాం చేయడానికి తప్ప అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదు. బడ్జెట్ ప్రస్తావనే లేదు. ప్రజల దారి మళ్లించేందుకు అన్నీ అబద్ధాలు వల్లించిండు. సభలో లేని మోదీ గురించి మాట్లాడొచ్చా? గతంలో నేను పార్లమెంట్ లో మాట్లాడితే నాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కదా? ఇప్పుడు మీరు చేసిందేంటి? కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలే. రాజీనామాకు కేసీఆర్ సిద్ధం కావాలి. డేట్, టైమ్ నిర్ణయించు. మేం తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా?’ అని సంజయ్ సవాల్ విసిరాడు.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయనని ప్రధాని చెప్పారని, దీనిపై కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని సంజయ్ ప్రశ్నించాడు. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని, 11 నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుందని తెలిపాడు. శాసనసభ సమావేశాలు రాజకీయ సభగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, నాయకులు కుమార్, ప్రకాశ్ రెడ్డి, శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.