దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే… ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. కాగా… ఈ సారి ఈ 5జీ సేవలు లాంఛింగ్ తేదీని కూడా ప్రకటించడం గమనార్హం. అక్టోబర్ 1వ తేదీన ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. దీనిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ వెల్లడించింది.
అక్టోబర్ 1వ తేదీన జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ నెట్‌వర్క్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంచ్ చేయనున్నారని … నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ట్వీట్ చేసింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనుంది.
5జీ సర్వీస్‌లను మోదీ లాంచ్ చేశాక.. ప్రైవేట్ టెలికం సంస్థలు 5జీ నెట్వర్క్ రోల్అవుట్ను మొదలుపెడతాయి. అక్టోబర్‌లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రముఖ టెలికం కంపెనీలు రిలయన్స్ జియో , ఎయిర్టెల్ ఇప్పటికే ప్రకటించాయి. అక్టోబర్ ప్రథమార్థంలో 5జీ సర్వీస్‌లను ప్రారంభిస్తామని ఎయిర్టెల్ చెప్పగా.. దీపావళి నాటికి 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేస్తామని జియో స్పష్టం చేసింది. వొడాఫోన్ ఐడియా ఈ విషయంలో ఇంకా స్పష్టతనివ్వలేదు.