ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళలోని వైయనాడ్ జిల్లాలో తీవ్రమైన వరదల కారణంగా సంభవించిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. కేరళ వాయనాడ్ వరదల్లో సుమారుగా 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. ఎంతోమంది ఆచూకీ నేటికీ తెలియకుండా పోయింది. కొన్ని ఊళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి… ఇంత భీకర వరదలు కేరళ చరిత్రలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అంటుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విరాళం కేరళ ప్రజలకు ఈ కష్టకాలంలో ఉపశమనం కలిగించేందుకు, అంతర్జాతీయ సహాయం అవసరమైన సమయంలో అండగా నిలిచేందుకు ప్రభుత్వానికి దోహదపడుతుంది. ఈ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
కేరళలో ముమ్మరంగా విపత్తు నివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైన సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విరాళాన్ని అందించడంతో పాటు, ప్రగతిశీలంగా కేరళ ప్రభుత్వం మరియు స్థానిక అధికారులకు సంపూర్ణ సహాయం చేస్తుందని కూడా స్పష్టం చేసింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేరళకు అండగా నిలవడం ఇది తొలిసారి కాదు, గతంలో 2018 లో కేరళ లో వరదలు సంభవించినప్పుడు కూడా చంద్రబాబు సీఎం గ ఉన్నారు. అప్పుడు కూడా కేరళకు ఆంధ్ర ప్రదేశ్ సాయం చేసింది.
కేరళ ప్రజల సహాయార్ధం సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది మేము సైతం అంటూ ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయిలు, రెబెల్ స్టార్ ప్రభాస్ రెండు కోట్లు, అల్లు అర్జున్ 50 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. మోహన్ లాల్ ఆర్మీ జవాన్ లతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే