»Yogi Adityanath On 2024 Up Bjp And Loksabha Election Results
Yogi Adityanath : అతి విశ్వాసమే బీజేపీని దెబ్బతీసింది.. యోగి ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ బీజేపీ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆయన భిన్నంగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
Yogi Adityanath On Lok Sabha Results : అతి విశ్వాసమే బీజేపీని 2024 లోక్ సభ ఎన్నికల్లో దెబ్బ తీసిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(YOGI ADITYANATH) వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో(LOKSABHA ELECTIONS) యూపీ బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్లో గెలుపుపై అతిగా విశ్వాసం పెట్టుకోవడం వల్ల ఈ స్థితి వచ్చిందని అన్నారు. ఆదివారం లక్నోలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
అయితే 2014 నుంచి ఇప్పటి ఎన్నికల వరకు కూడా మోదీ సారథ్యంలోని బీజేపీ సమర్థవంతంగా పని చేయగలిగిందని అన్నారు. అందుకనే మూడో సారి సైతం కేంద్రంలో పట్టం ఎక్కగలిగిందని చెప్పారు. ప్రతిపక్షాలను దీటుగా బీజేపీ ఎదుర్కొందని అన్నారు. 2014లో వచ్చిన ఓట్ల శాతమే 2024లో సైతం రావడం గమనించ దగ్గ విషయం అంటూ తెలిపారు. అయితే ఈ సారి విజయం సాధించడంలో మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు.
మొన్న ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో పది స్థానాల్లో ఇండియా కూటమి పార్టీలు విజయం సాధించాయి. రెండు స్థానాల్లో మాత్రమే బీజేపీ, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాల నేపథ్యంలో యోగి(YOGI ) ఇలా వ్యాఖ్యలు చేసినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఇండియా కూటమి విజయాలు దేశంలో రాజకీయ వాతావరణం మార్పుకు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తోంది.