టీడీపీ నేత నారా లోకేశ్(nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా…సైకో పోయి సైకిల్ రావాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. నాడు నేడు అంటూ హడావిడి తప్ప అభివృద్ధి ఏం చేయడం లేదని ఆరోపించారు. గతంలో ప్రజలతో మాట్లాడిన సీఎం జగన్ ప్రస్తుతం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రజలను చూసినా, సీబీఐని చూసినా అతనికి భయమే పట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లోకి వచ్చిన తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు.
మరోవైపు చంద్రబాబు ప్రవేశపెట్టిన విదేశీ విద్యానిధి పథకాన్ని జగన్ రెడ్డి చంపేశాడని అన్నారు. దీంతో విదేశాల్లో ఉన్న అనేక మంది తెలుగు విద్యార్థులు అప్పులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఇక్కడి నుంచి చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారు సైతం తగ్గిపోయారని లోకేశ్ చెప్పారు. ఇక ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని నారా లోకేశ్ ప్రశ్నించాడు. మైనారిటీల అభివృద్ధి ఎవరి పాలనా కాలంలో జరిగిందో గుర్తుతెచ్చుకోవాలని లోకేశ్ పేర్కొన్నారు.