దొంగలు ఏటీఎంని పగలగొట్టి దానిలోని డబ్బు చోరీ చేయడానికి ప్రయత్నించారు. అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎంనే కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ATM Theft in Kamareddy : ఎంగ పగలగొట్టినా తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటన కామారెడ్డి(KAMAREDDY) జిల్లా బిచ్కందలోన చోటు చేసుకుంది. అక్కడి ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంని(ATM THEFT) దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో రూ.3.97 లక్షలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తొలుత ఏటీఎం కేంద్రంలోకి దొంగలు చొరబడ్డారు. ఏటీఎం(ATM) మిషన్ని పగలగొట్టి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. అది ఎంతకూ పగల్లేదు. దీంతో వారు ఏటీఎంకు తాళ్లు కట్టి తమ క్వాలిస్ వాహనంలోకి ఎక్కించారు. తర్వాత ఏటీఎం గది అద్దాలను బద్ధలుగొట్టారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ సమయంలో అక్కడ సైరెన్ మోగింది. దీంతో అప్రమత్తం అయిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే లోపే దొంగలు ఏటీఎంతో సహా ఉడాయించారు.
తర్వాత వారు మహారాష్ట్రకుగాని, కర్ణాటకకు గాని పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు వెళ్లే సమయంలో పెద్ద ఏడ్గి గ్రామంలో రెండు బైకుల్ని సైతం చోరీ చేశారు. జుక్కల్ దగ్గరలోని గుల్ల వద్ద వారు క్వాలిస్ వాహనాన్ని వదిలేశారు. అనంతరం రెండు బైకులతో పారిపోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తెలంగాణలో ఈ మధ్య తరచుగా దోపిడీలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు మాత్రం ఈ దొంగలను వీలైనంత తొందరలో పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు.