Kishan Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికల్లో ఓడిపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోవడం పక్కా అన్నారు. మంత్రి కేటీఆర్కు సిరిసిల్లలో ఓటమి తప్పదన్నారు. ఓటమి తప్పదని.. అందుకే నామినేషన్ వేసిన వారిని బలవంతంగా విత్ డ్రా చేయించారని ఆరోపించారు.
గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేసిన వారిని బెదిరించి విత్ డ్రా చేయించారని కిషన్ రెడ్డి (Kishan Reddy) గుర్తుచేశారు. పోలీసుల ద్వారా బెదిరించారని.. ఇతర పార్టీ నేతలను, ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా వదల్లేదని చెప్పారు. గజ్వేల్లో 114 మంది ధరణి బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ దాఖలు చేశారని గుర్తుచేశారు. వారందరినీ భయభ్రాంతులకు గురిచేసి విత్ డ్రా చేయించారని తెలిపారు.
బీజేపీ నుంచి 39 మంది బీసీలు పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నుంచి 22 మంది.. బీఆర్ఎస్ నుంచి 23 మంది మాత్రమే బరిలో ఉన్నారని పేర్కొన్నారు. బీసీల గురించి ఆలోచించేది బీజేపీ మాత్రమేనని వెల్లడించారు. కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి గెలిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.