సీఎం జగన్పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? అని యనమల ప్రశ్నించారు. పీడీ అకౌంట్ నిధులు ఎన్ని వాడారు, పెండింగ్ బిల్లులు ఎన్ని? ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదు? అని అడిగారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయి? కేంద్రం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది, ఎన్ని కోట్లు దారిమళ్లాయి? అని యనమల ప్రభుత్వాన్ని నిలదీశారు.
యనమల ఆరోపణలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రాష్ట్రం 11.43 శాతం వృద్ది సాధించిందని చెప్పారు. ఈ విషయం తెలిసి యనమల రామకృష్ణుడికి నిద్రరావడం లేదన్నారు. అందుకే వృద్దిరేటును మైనస్ 4గా చెబుతున్నారని పేర్కొన్నారు. స్థిరధరల ప్రకారం లెక్కిస్తే 11.43 శాతం వస్తోందని చెప్పారు. ఇక ప్రస్తుత ధరల ప్రకారం లెక్కగడితే 18.47గా ఉందన్నారు. మరి ఏ లెక్కన -4 అని అడిగారు. ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.