climate change : ఇదివరకటి కాలంలో ఎక్కడైనా ఆకుపచ్చటి సముద్రపు నీరు కనిపిస్తే లొకేషన్ చాలా బాగుందని అంతా అనుకునే వారు. కొన్ని దేశాల్లో, అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇలా కొరల్ గ్రీన్(green) కలర్లో ఉండే ఆకుపచ్చటి నీరు మనకు దర్శనం ఇచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మహా సముద్రాల్లో ఉన్న నీరు దాదాపుగా సగానికి పైగా పచ్చ రంగులోకి మారిపోయింది. గత 20 ఏళ్లలో ఈ మార్పు గణనీయంగా జరిగింది. ఇప్పుడు ప్రపంచపు సముద్రాల్లో మొత్తం 56 శాతం నీరు పచ్చ రంగులోనే ఉందట.
సముద్రపు ఎకో సిస్టంలో ఈ మార్పు క్రమంగా వేగంగా జరుగుతూ వస్తోందని పరిశోధకులు గుర్తించారు. బ్రిటన్కు చెందిన నేషనల్ ఓషనోగ్రఫీ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏర్పడ్డ మార్పుల వల్ల ఈ రంగు మారడం అనే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అన్నారు.
ఈ పరిశోధనల కోసం పరిశోధకులు నాసా డాటాను వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లలో నాసా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలను పరిశీలించారు. వాతావరణంలోని(climate) కార్బన్డయాక్సైడ్ని సముద్రంలో(ocean ) ఉండే ప్లాంగ్టాన్లు, ఆల్గేలు ఎక్కువగా పీల్చుకుంటున్నాయని తేల్చారు. ఫలితంగా ఇవి అభివృద్ధి చెంది సముద్రపు రంగులు మారుతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాల్లో 25 శాతం సముద్రాల్లోని ప్లాంగ్టాన్ల లాంటివే పీల్చుకుంటున్నాయని పేర్కొన్నారు.