తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై షర్మిల విమర్శించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చిన్న దొర అంటూ స్టార్ట్ చేశారు. ‘చిన్న దొర కుటుంబ పాలన అంటున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అట.. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారని అడిగారు. మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుచేశారు. రుణం మాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. వారి గోడు మీకు పట్టదా’ అని షర్మిల విరుచుకుపడ్డారు.
కేసీఆర్ 420
కేసీఆర్‌కి 420.. ఒక మోసగాడు అని షర్మిల విరుచుకుపడ్డారు. ఆయనను తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని చెప్పారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. సీఎంగా ఉండి అబద్దాలు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదొందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్యలు జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణం మాఫీ కాక రైతులు అప్పుల పాలయ్యారని గుర్తుచేశారు. వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ పంట నష్ట పరిహారం అందలేదన్నారు.
అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు
అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం లేదని చెబుతున్నారు.. ఇది పచ్చి అబద్దమని ధ్వజమెత్తారు. మొదటిసారి ఏర్పడిన ప్రభుత్వం 65 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని.. రెండోసారి ఏర్పడిన ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో గ్రూప్-1 పరీక్ష రాయొద్దని చెప్పి.. ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదని షర్మిల విమర్శించారు.
కుటుంబ పాలన
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అని విపక్షాలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ నిన్న అసెంబ్లీలో స్పందించారు. అవును తమది కుటుంబ పాలనే.. పెద్ద కొడుకుగా కేసీఆర్ అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని మాట్లాడారు. వసుధైక కుటుంబం అని చెప్పారు. కేటీఆర్ కామెంట్లపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు.