భారతీయ సినిమాల్లో మరపురాని సినిమా శంకరాభరణం. గొప్ప సాంఘిక చిత్రాన్ని తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఆ సినిమా విడుదల రోజే కన్నుమూయడం మరింత విషాదాన్ని నింపింది. సినీ రంగానికి భారతీయ సంస్కృతిని అద్దిన గొప్ప మూర్తిమయుడు విశ్వనాథ్. ఆయన సినిమాలన్నీ సామాజిక ఇతివృత్తంతో కూడినవే. ఎలాంటి వంకర మాటలు, జుగుప్సకరమైన హాస్యం ఉండవు. అందుకే ఆయన సినిమాలన్నీ క్లాసిక్ చిత్రాలు అంటారు. అందమైన పాటలు.. సుతిమెత్తని మాటలు ఆయన శైలి.
కొత్త వ్యక్తి జేవీ సోమయాజులు ప్రధాన పాత్రతో విశ్వనాథ్ శంకరాభరణం సినిమాను తెరకెక్కించారు. మంజు భార్గవి, చంద్రమోహన్, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. ఏడిద నాగేశ్వర్ రావు నిర్మాతగా వ్యవహరించగా.. కేవీ మహదేవన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆ పాటలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో మార్మోగుతుంటాయి. మహా రచయిత జంధ్యాల మాటలు అందించారు. ఈ సినిమా 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలై సంచలన విజయం సాధించింది.
ఈ సినిమా ఎవరు చూస్తారని కొందరు నిర్మాతలు ఎగతాళి చేశారు. అతి తక్కువ థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన అనంతరం ప్రేక్షకులు బారులు తీరారు. తండోపతండాలుగా తరలివచ్చి ఈ సినిమాను చూశారు. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. సామాజిక ఇతివృత్తంతో.. సంఘం కట్టుబాట్లు.. సమాజం ధోరణి ఎలా ఉంది అనే సందేశంతో తీసిన ఈ సినిమా ఇప్పటికీ భారతీయ సినిమాల్లో ఆణిముత్యంగా చెప్పవచ్చు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు లభించాయి. ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు.