తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించి నేటి తరానికి తెలిసింది చాలా తక్కువ. కానీ వాటి మూలాల్లోకి వెళ్లి మరీ.. భావితరానికి తెలిసేలా చేశారు దిగ్దదర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. శంకరాభరణం, సాగర సగంగమం, స్వాతిముత్యం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు. అలాంటి మహానుభావుడు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. శంకరాభరణంతో కళాతపస్విగా మారిన విశ్వనాథ్.. ఆ సినిమా విడుదలైన రోజే.. అంటే ఫిబ్రవరి 2న శివైక్యం అయిపోయారు. శంకరాభరణం సినిమా 1980, ఫిబ్రవరి 2న రిలీజ్ అయింది. ఇది ఆ శివుడి లీలే అని చెప్పొచ్చు. అందుకే అలాంటి మహానుభావుని జీవితం గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే 2018లోనే విశ్వనాథ్ బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. ‘విశ్వదర్శనం’ పేరుతో, ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో.. జనార్ధన మహర్షి దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మాణంలో.. ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అంటూ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ బయోపిక్ ప్రకటనకే పరిమితమైంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందా.. లేదంటే ఆగిపోయిందా.. అనేది కూడా తెలియదు. అయితే ఇప్పుడు కళాతపస్వి మరణం అందరినీ కలిచివేసింది. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఈ నేపథ్యంలో విశ్వానథ్ బయోపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికైనా విశ్వదర్శనం గురించి ఏదైనా ప్రకటన వస్తుందా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.. చూద్దాం ఏం జరుగుతుందో!