TV anchor faints on air : భారత దేశ వ్యప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లేవారు మాత్రం తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో దూరదర్శన్లో న్యూస్ చదువుతున్న ఓ న్యూస్ యాంకర్ లైవ్లోనే కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) దూరదర్శన్ కేంద్రంలో చోటు చేసుకుంది. లోపాముద్ర సిన్హా అనే న్యూస్ రీడర్ ఇలా లైవ్లో సొమ్మసిల్లిపోయారు.
దేశ వ్యాప్తంగా ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల గురించి లోపాముద్ర వార్త చదువుతున్నారు. అదే సమయంలో ఆమెకు సడన్గా బీపీ(BP) డౌన్ అయిపోయింది. దీంతో లైవ్లోనే ఆమె సొమ్మసిల్లిపోయారు. ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆమె ఈ విషయమై స్పందించారు. లైవ్(live) ప్రారంభం కాక ముందు నుంచే ఎండ కారణంగా తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందన్నారు.
కాస్త కుదుట పడిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం అయ్యిందని లోపాముద్ర తెలిపారు. అయితే వార్తలు చదువుతుండటంతో తాను చాలా సేపటి నుంచి నీటిని తీసుకోలేదని చెప్పారు. దీంతో వాతావరణ వార్తలు చదువుతుండగా ఒక్కసారిగా కళ్లలో చీకట్లు బయర్లుగమ్మాయని చెప్పారు. ఆ తర్వాత సొమ్మసిల్లిపోయినట్లు వెల్లడించారు. అక్కడున్న సిబ్బంది అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆశ్చర్యపోయారు. వెంటనే స్పందించి ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోందంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.