ఎండాకాలంలో అంతా పుచ్చకాయలు తింటారు. అయితే వాటిలో గింజలను పడేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటితో బోలెడు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే?
Watermelon Seeds Benefits : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. అంతా రకరకాల పానీయాలతో పాటుగా ఎక్కువగా పుచ్చకాయల్ని తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే దాదాపుగా అంతా పుచ్చకాయ ముక్కలు తినేసి గింజల్ని పడేస్తుంటారు. అలా చేయడం ఎంత మాత్రమూ సరైనది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయతో పాటుగా గింజల్నీ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..
పుచ్చకాయలో ఉండే పోషకాల్లో ఎక్కువ భాగం వాటి గింజల్లోనే ఉంటాయిట. అందుకనే వాటిని తప్పక తినాలని అంటున్నారు. వీటిని తినడం వల్ల ప్రొటీన్లు, విటమిన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం తదితరాలు మన శరీరానికి అందుతాయి. అందుకనే వీటిని తినడం వల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది.
పుచ్చకాయ గింజల్లో మోనో అన్ శాచ్యురేటెడ్ , పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల గుండె జబ్బులు రావు. మధుమేహం లాంటి దీర్ఘ కాలిక వ్యాధులూ దరి చేరవు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. అలాగే వీటిలో ఉండే పీచు పదార్థాల వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. పేగుల వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ సీ మనలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పుచ్చ గింజల్లో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి వీటిలోని ఫ్యాటీ యాసిడ్స్ ఆకలి కోరికలను అదుపు చేస్తాయి. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మెదడు పని తీరును మెరుగు పరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.