»Earthquake Of Magnitude 5 3 Jolts Himachal Pradesh
Earthquake : హిమాచల్ ప్రదేశ్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
గత రాత్రి హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 5.3గా నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Earthquake In Himachal Pradesh : గురువారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో హిమాచల్ ప్రదేశ్లోని చంబా(Chamba) జిల్లాలో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. కొన్ని సెకెన్ల పాటు ఇలా భూమి కంపించింది. పంజాబ్, హరియాణా, ఛండీగఢ్ల్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి ప్రకంపించింది. దీంతో పలు చోట్ల భయంతో జనం బయటకి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగ లేదు. దీనిపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
ఈ విషయమై సిమ్లాలోని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ( ఎన్సీఎస్) వివరాలు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్లోని పాంగిలో భూమికి 10 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం(Earthquake) వల్ల ఆ సమీప గ్రామాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రభావితం అయ్యింది. ప్రత్యేక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ విషయమై స్థానికుడు ఒకరు ఇలా తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ‘కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. నేను భవంతి నుంచి కిందకు దిగిపోదామనుకుంటున్న తరుణంలో ప్రకంపనలు నిలిచిపోయాయి’ అని స్థానికుడు ఒకరు తెలిపారు. కాగా, 1905లో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో సంభవించిన భారీ భూకంపం అప్పట్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో ఈ భూకంపం ఏకంగా 20 వేల మందిని బలితీసుకుంది.