KTR: ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారని నోటీసులు పంపారు. వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
అసలు కొంచెం కూడా తనకు సంబంధం లేకపోయినా పదే పదే తన పేరున కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడుతున్న వాళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముగ్గురు నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా కేటీఆర్ మరోసారి నోటీసులు పంపారు. అసత్య ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.