»China Launches Signal Relay Satellite For Mission To Moons Hidden Side
China : చంద్రుడి ఆవలి వైపునకు చైనా ఉపగ్రహం
చంద్రుడి ఆవలి వైపు భాగం మీదికి చేరుకునేలా చైనా తాజాగా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది భూమి, చంద్రుడి మధ్య కమ్యునికేషన్ శాటిలైట్‌గా పని చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
China Launches Satellite : భూమికి దూరంగా ఉన్న చంద్రుడి ఆవలి వైపు భాగంలోకి చైనా తాజాగా శాటిలైట్ రాకెట్‌ని ప్రయోగించింది. బుధవారం చైనాలోని హైనాన్ ప్రావిన్సు నుంచి 1.2 టన్నుల క్యూకియావ్2 శాటిలైట్‌ని(Satellite) ఆకాశానికి పంపింది. లాంగ్‌మార్చ్8 అనే రాకెట్‌తో ద్వారా దీన్ని ప్రయోగించింది. చంద్రుడిపై మనకు కనిపించే భాగం నుంచి డేటాను భూమికి పంపించడం సులువు.. కానీ అవతలి వైపు భాగం నుంచి కమ్యునికేషన్లను నెలకొల్పడం కష్టతరమైన విషయం.
తాజాగా చైనా(China) ఇలా చంద్రుడి అవతలి వైపు భాగం నుంచి భూమికి కమ్యునికేషన్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రయోగం చేసింది. క్యూకియావ్ 2 అనే ఈ ఉపగ్రహం చంద్రుడి చుట్టూ తిరుగుతూ మేలో ప్రయోగించనున్న ఛాంగి6 మిషన్ నుంచి సంకేతాలను భూమికి ప్రసారం చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా చంద్రుడికి అవతలి వైపు భాగంలో ఉన్న మట్టి, ఖనిజాల్లాంటి వాటి సమాచారం తెలుసుకోవాలని చైనా భావిస్తోంది.
ఇది చంద్రుడి( moon) దగ్గర కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంటే చైనా దీన్ని ప్రధాన కమ్యూనికేషన్ శాటిలైట్‌గా ఉపయోగించుకోవాలని తలుస్తోంది. చంద్రుడిపై మానవ యాత్రలు, ఇతర గ్రహాలపై కార్యకలాపాల నిర్వహణలో కమ్యునికేషన్లను దీని ద్వారా జరపాలనే యోచనలో ఉంది. ఇదే ప్రయోగంలో టియాండు1,2 అనే మినీ ఉపగ్రహాలనూ చంద్రుడి మీదికి ప్రయోగించింది. కమ్యునికేషన్ నెట్వర్క్ సమూహాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలపై వీటి ద్వారా పరీక్షించనుంది.