ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇందుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించారు. మనస్థిమితం లేని 38 ఏళ్ల వ్యక్తి ఈ ఫోన్ చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. అతను అప్పటికే ఢిల్లీలోని గులాబీ బాగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి గం.12.05కు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరించాడు. అతనిని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినందున వెంటనే అరెస్ట్ చేయలేదని తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఢిల్లీ గేట్ దగ్గర ఉన్న గురు నాన్ ఐ సెంటర్లో నర్సింగ్ ఆర్డర్లీగా ఆ వ్యక్తి పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతనికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను అడగ్గా.. హాస్పిటల్ వర్గాలను కనుక్కొని వాస్తవాలు నిర్ధారిస్తామన్నారు. మతస్థిమితం లేని వ్యక్తిని, అందునా మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని కంటి ఆసుపత్రిలో నర్సులకు సహాయకుడిగా ఎలా తీసుకున్నారనేది తెలియాల్సి ఉందన్నారు. కేజ్రీవాల్‌ను చంపుతానంటూ ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నట్టు ఆయన తెలిపారు.