Building Collapse In Kolkata : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనం కూలిపోయింది. దీంతో ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణ సెకలాల కింద చిక్కుకున్న మరో పద్నాలుగు మందిని సహాయక సిబ్బంది కాపాడారు. అయితే భవన సెకలాల కింద మరికొంత మంది ఉండి ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కోల్కతా(Kolkata)లోని గార్డెన్ రిచ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని ప్రకటించారు.
ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇలా అనుమతులు లేకుండా కట్టడాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ అన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేదానిపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందన్నారు. మృతులతోపాటు గాయపడిన వారికి కూడా పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ ప్రమాదం వల్ల ఐదంతస్థుల భవనానికి దగ్గరలో ఉన్న ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. వాటిని చక్కదిద్దుకోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిపారు.