పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ పాక్ 14వ అధ్యక్షుడిగా రెండోసారి దేశాధినేత అధికారం చేపట్టారు. ఈక్రమంలో దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Pakistan: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ పాక్ 14వ అధ్యక్షుడిగా రెండోసారి దేశాధినేత అధికారం చేపట్టారు. ఈక్రమంలో దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా దేశాధ్యక్షుడి సతీమణికి ప్రథమ మహిళ హోదా లభిస్తుంది. అయితే జర్దారీ భార్య, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు.
ఈక్రమంలో తాజా పదవీ కాలంలో ఈ హోదా చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తవర్ భుట్టో ఓ పోస్ట్ చేసింది. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర్నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేవరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని ఆమె పోస్ట్ చేశారు. దీంతో పాక్ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ఖరారు అయినట్లు తెలుస్తుంది. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె పీపీపీ పార్టీ నుంచి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.