ECI Directions : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ కీలకమైన సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగొద్దని సూచించింది. భక్తులు, దైవ సంబంధాల విషయంలో అవమానకరంగా మాట్లాడవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్(ECI) హెచ్చరించింది. ఇలాంటి ఎన్నికల నిబంధనావళిని ఎవరూ అతిక్రమించడానికి వీలు లేదని తెలిపింది. గతంలో ఇలా అతిక్రమించిన వారిని మందలించి వదిలేసే వాళ్లం గాని ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రాజకీయ పార్టీలు(Political Parties ), రాజకీయ నాయకులు, అభ్యర్థులు, స్టార్ క్యాంపైనర్లు ఈ నియమావళిని కచ్చితంగా పాటించాలని ఈసీఐ తెలిపింది. దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు లాంటి మత సంబంధమైన వాటిని ఎన్నికల ప్రచారానికి వినియోగించవద్దని ఆదేశించింది. ప్రచారంలో అంతా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులను కించపరిచేలా, అవమాన పరిచేలా పోస్టులు పెట్టకూడదని తెలిపింది. రాజకీయాలను నైతికతతో చేయాలని చెప్పింది. మహిళల గౌరవానికి, పరువుకు భంగం కలిగించేలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరింది. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రచార ప్రకటనలు ఇవ్వకూడదని చెప్పింది. అలాగే ధ్రువీకరణ లేని వార్తల్ని ప్రచారం చేయకూడదని ఎన్నికల కమిషన్ సూచించింది.